పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్–రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక చేరిక (Financial Inclusion) విధానాలను వివరించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్యాంకింగ్ వ్యవస్థను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు చేపట్టామని ఆమె తెలిపారు. ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు చేరుకోవాలని మాత్రమే కాకుండా వ్యవసాయ కూలీలు, రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు వంటి ప్రతి వర్గానికీ బ్యాంకు రుణాలు, ఆర్థిక సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని ఆమె పేర్కొన్నారు.
ఎన్పీఏల నుంచి బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ వరకు 2019లో తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs) కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు రుణాలు అందించే సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని చెప్పారు.
గ్యారంటీ లేకుండానే రుణం
చిన్న వ్యాపారులు బ్యాంకు రుణం కోసం బంగారం లేదా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ హామీ విధానాన్ని అమలు చేసిందని ఆమె వివరించారు.తోపుడు బండిపై కూరగాయలు, పండ్లు విక్రయించే చిరు వ్యాపారులు, చిన్న రైతులు, మత్స్యకారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి గ్యారంటీ లేకుండానే తక్కువ వడ్డీతో రుణాలు అందించే వ్యవస్థను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మార్కెట్లలో తాను ప్రత్యక్షంగా చూసిన ఒక పరిస్థితిని నిర్మలా సీతారామన్ ఉదాహరణగా వివరించారు. రోజువారీ వ్యాపారం కోసం కొంతమంది వ్యాపారులు మధ్యవర్తుల వద్ద రూ.1,000 అప్పు తీసుకుంటే చేతికి రూ.900 మాత్రమే వచ్చేదని, సాయంత్రానికి మాత్రం పూర్తి రూ.1,000 తిరిగి చెల్లించాల్సి వచ్చేదని చెప్పారు. ఇలాంటి అధిక వడ్డీ అప్పుల వల్ల చిన్న వ్యాపారులకు ఎలాంటి లాభం మిగలదని అందుకే ప్రభుత్వ హామీతో బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు అందించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు.
2004–2014 మధ్య కాలంలో రాజకీయ సిఫారసుల ఆధారంగా “ఫోన్ బ్యాంకింగ్” విధానంలో రుణాలు మంజూరు చేయించడంతో బ్యాంకులకు భారీ ఎన్పీఏలు వచ్చాయని నిర్మలా సీతారామన్ విమర్శించారు. అర్హతను పక్కనబెట్టి రాజకీయ ఒత్తిళ్లతో రుణాలు ఇవ్వడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిందని అన్నారు.
ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిందని, ఢిల్లీ నుంచి ఫోన్లు రావడం లేదని బ్యాంకులే గ్రామాలకు వెళ్లి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రుణాలు అందిస్తున్నాయని చెప్పారు.
“బ్యాంకులు మీ దగ్గరకు వస్తున్నాయి… మీరు బ్యాంకుల కోసం తిరగాల్సిన అవసరం లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
నరసరావుపేట దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది
నరసరావుపేటలో నిర్వహించిన ఈ భారీ క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం ద్వారా 1,03,246 మంది లబ్ధిదారులకు రూ. 3,216 కోట్ల రుణాలు పంపిణీ జరగడం సాధారణ విషయం కాదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన “వికసిత్ భారత్–2047” లక్ష్య సాధనలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రజలు తమకు లభించిన రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని, బ్యాంకులు కూడా వారికి అండగా నిలుస్తాయని హామీ ఇచ్చారు.రుణాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు వాటిని ఉత్పాదక పెట్టుబడులుగా మార్చుకుని స్వయం ఉపాధిని విస్తరించుకోవాలని అదే దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి పిలుపునిచ్చారు.

