సీఎం ప్రశంసలు అందుకున్న పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి అరుదైన ప్రశంసలు లభించాయి. పల్నాడు జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో రెండో స్థానంలో నిలవడంపై సీఎం బహిరంగ వేదికపై కలెక్టర్‌తో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించారు.

పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లా సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ అధికార యంత్రాంగం పనితీరును కొనియాడారు.

“పల్నాడు జిల్లా కలెక్టర్ ని , జిల్లా అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కూడా గట్టిగా అభినందించండి” అంటూ సీఎం పిలుపునివ్వడంతో సభా ప్రాంగణం చప్పట్లు, హర్షధ్వానాలతో మారుమోగిపోయింది.



జిల్లా అభివృద్ధిలో రాజకీయ నాయకత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం కీలక పాత్ర పోషించిందని సీఎం పేర్కొన్నారు. “నాకు ఒక పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉంటే.. మరోపక్క నా నమ్మకమైన టీమ్ అయిన అధికార యంత్రాంగం నిలబడింది. ఈ ఇరువర్గాల సమష్టి కృషి వల్లే పల్నాడు రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది” అని అన్నారు.

కలెక్టర్ కృతికా శుక్లా నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, రెవెన్యూ సేవలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో జిల్లా విశేష ఫలితాలు సాధించిందని సీఎం పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి సమక్షంలో బహిరంగ సభ వేదికపై కలెక్టర్‌కు లభించిన ఈ ప్రశంసలు జిల్లా అధికార యంత్రాంగంలో మరింత ఉత్సాహాన్ని నింపాయని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి ఇదే స్ఫూర్తితో మరింత కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.