ఈనెల 7వ తేదీ నుండి 21 వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన సింహ అధికారులను ఆదేశించారు.
శనివారం వివిధ శాఖల అధికారులతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ నుండి 21 వతేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు సంబంధించి యోగ ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీ లు, ఆధ్యాత్మిక ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు, వాకదాన్, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

ఈనెల 7వ తేదీన ప్రారంభ కార్యక్రమం, 21వ తేదీన జిల్లా స్థాయిలో పెద్దఎత్తున ప్రజలతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఈనెల 17 వ తేదీన కోటప్పకొండ లోను, 19వ తేదీన అమరావతి లో ప్రజలతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

