జాతీయ రహదారులపై అక్రమ కట్టడాలు తొలగించండి

నరసరావుపేట: జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా అధికారులను ఆదేశించారు.

శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ‘ఫలోడి యాక్సిడెంట్’ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్‌వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ, వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ , జీపీఎస్ మానిటరింగ్ మరియు ఈ-చలాన్ల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక డాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్, 2002 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, హైవే సేఫ్టీ జోన్లలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపార అనుమతులు మంజూరు చేయవద్దని, పాత లైసెన్సులను సమీక్షించాలని పేర్కొన్నారు. జిల్లాలో హైవే పెట్రోలింగ్, ప్రతి 75 కిలోమీటర్ల పరిధిలో బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, రికవరీ క్రేన్లు మరియు ట్రక్ లే-బై (విశ్రాంతి గదులు, పార్కింగ్, ప్రథమ చికిత్స) సౌకర్యాలు ఉండేలా జాతీయ రహదారుల సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద రహిత ప్రయాణం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆమె గుర్తుచేశారు.

గత సమావేశంలో చర్చించిన రొంపిచర్ల జంక్షన్ ఫ్లైఓవర్ ప్రతిపాదనలపై లీ అసోసియేట్స్ ఇచ్చిన నివేదికను సమీక్షిస్తూ, అక్కడ ప్రస్తుతం ఫ్లైఓవర్ సాంకేతికంగా సాధ్యం కానందున, తక్షణ భద్రతా చర్యలుగా ముందస్తు హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు (రుంబుల్ స్ట్రిప్స్), రహదారి మార్కింగ్స్ మరియు బ్లింకర్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గణపవరం మరియు తిమ్మపురం వద్ద హైమాస్ట్ లైట్ల మరమ్మతుల విషయంలో చిలకలూరిపేట మున్సిపాలిటీ అంగీకారం తెలిపినందున, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

*బ్లాక్ స్పాట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి : జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు*
సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన 35 బ్లాక్ స్పాట్స్ (ప్రమాద ప్రాంతాలు) వద్ద, వాహనదారులు సబ్ రోడ్డు నుండి ప్రధాన రహదారిలోకి ప్రవేశించే సమయంలో వేగాన్ని నియంత్రించడానికి ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ వేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను కోరారు. ఆయా ప్రాంతాలలో హై-ఇంటెన్సిటీ లైటింగ్, స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

అలాగే గత నెలలో పోలీస్ శాఖ కోరిన 15 బ్రీత్ అనలైజర్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, ‘స్టాప్ అండ్ వాష్’ వంటి కార్యక్రమాలతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తామని ఎస్పీ తెలిపారు.

రవాణా శాఖతో కలిసి ఏప్రిల్ నెలలో 541 కేసులు నమోదు చేసి రూ.39 లక్షల పైగా జరిమానా వసూలు చేశామని, మే నెలలో ఓవర్‌లోడింగ్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 187 కేసులు నమోదు చేశామని వివరించారు.

*జిల్లా హైవే సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ నియామకం*
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లాలో జాతీయ రహదారుల భద్రత కోసం ప్రత్యేకంగా “జిల్లా హైవే సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కమిటీ”ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, ఎస్పీ కో-చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్, జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆర్ అండ్ బి ఈఈ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తూ నిరంతరం సమన్వయంతో పనిచేస్తారని వివరించారు. ప్రమాదాల డేటాను ఈ-డార్ ప్రాజెక్ట్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్ని శాఖలను ఆదేశించారు.