నర్సింగ్ చేసిన యస్.సి మహిళలకు ఇజ్రాయెల్ లో ఉపాధి అవకాశం

గుంటూరు, జూలై 20 : నర్సింగ్ చేసిన యస్.సి మహిళలకు ఇజ్రాయెల్ లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని యస్.సి.కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి. దుర్గా భాయి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సమన్వయంతో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నర్సింగ్ చేసిన యస్.సి మహిళలకు ఇజ్రాయెల్ దేశంలో ఉపాధి అవకాశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అన్నారు. దరఖాస్తులను గుంటూరు యస్.సి.కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. హోం బేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలు మూడు వేల ఐదు వందలు ఉన్నాయని తెలిపారు.


25 నుండి 45 సంవత్సరాల ఈమధ్య వయస్సు గల మహిళలు మాత్రమే అర్హులని చెప్పారు. 1.5 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు, కనీసం 45 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ బరువు కలిగి ఉండాలని, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి, ఇంటర్మీడియట్ స్థాయి ఆంగ్లంలో ప్రావీణ్యం (CEFR- B2 స్థాయి) కలిగి ఉండాలని అన్నారు. సంరక్షణ సేవలను అందించడంలో అర్హత, అనుభవం కలిగి ఉండాలని చెప్పారు. సంబంధిత భారతీయ అధికారుల ద్వారా గుర్తింపు పొందిన లేదా పర్యవేక్షించిన కనీసం 990 గంటల (ఆన్-ది-జాబ్ ట్రైనింగ్తో సహా) సంరక్షణ కోర్సును విజయవంతంగా పూర్తి చేసినట్లు రుజువు చేస్తూ, సమర్ధ భారతీయ నియంత్రణ సంస్థ జారీ చేసిన సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నారు. లేదా సంబంధిత భారతీయ అధికారులచే గుర్తింపు పొందిన భారతీయ శిక్షణా సంస్థ అందించిన నర్సింగ్, ఫిజియోథెరపీ, నర్స్ అసిస్టెంట్ లేదా మిడ్ వైఫరీలో శిక్షణ పూర్తి చేసినట్లు రుజువు చేసే డిప్లొమా కలిగి ఉండాలన్నారు.

జి.డి.ఏ, ఏ.ఎన్.ఎం, జి.ఎన్.ఎం, బి.ఎస్సీ నర్సింగ్, బి.ఎస్సీ పోస్ట్ నర్సింగ్ అర్హత కలిగిన వారు కూడా అర్హులన్నారు. పాస్పోర్ట్ కనీసం మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు కావాలని అన్నారు. వేతనం నెలకు రూ.1,99,700/- గా ఉంటుందని తెలిపారు. ఎంపిక, తిరస్కరణ నిర్ణయాలు ఇజ్రాయెల్ యాజమాన్యం తీసుకుంటుందన్నారు.

ఇతర వివరాలకు కార్యనిర్వాహణాధికారి కె. వాణి (9705623027)ని సంప్రదించవచ్చని తెలిపారు